MANI & MALLI ASSOCIATES

MANI & MALLI ASSOCIATES we will under take architectural plans,structural designs, VASTU CONSULTANT, interior designs and land scaping

13/07/2022

శుభోదయం గత 5 రోజుల నుండి సూర్యుడు,చంద్రుడు కనిపించుట లేదు. వైఎస్ జగన్ కానీ,కెసిఆర్ కానీ మోడీ కానీ కిడ్నాప్ చేసి ఉండవచ్చు.
ఆచూకీ తెలిపిన వారికి d విటమిన్ భాహుమతి గా ఇవ్వబడును.
😀😀😀

23/03/2022

పిచ్చుకలూరు! (కథ)
----------------

సావిట్లో వాలు కుర్చీలో కూర్చుని చంద్రశేఖరం గారు ధాన్యపు కంకుల్ని జడలా పేని, వృత్తాకారంగా తయారు చేసి,మండువా ముందటి దూలానికి వేలాడదీయడానికి తయారు చేస్తున్నారు.

సమయం పది దాటింది.రెండో సారి టీ తీసుకువచ్చి"ముందు టీ తాగండి"అంది భార్య రత్నవతి.

"గూట్లోని పురుకొస తీసుకురా"అన్నారు చంద్రశేఖరం గారు.

కాసేపటికి కంకుల గుత్తిని తయారు చేసి,పురుకొసతో మండువా దూలానికి వేలాడదీశారు.ఎదురుగా వాలు కుర్చీలోంచి చూస్తున్నారు.కంకుల్ని తినడానికి వచ్చే పిచ్చుకుల గురించి,ప్రతి సంవత్సరం పంటలు వచ్చే సమయంలో ఇలా తయారు చేసి,దూలానికి వేలాడదీయడం,వాళ్ళ తాతగారి కాలం నుండి ఆయనకి అలవాటు.

అంతకు ముందు ఎక్కువగా వచ్చే పక్షులు,ఇప్పుడు రావడం లేదు,తగ్గిపోయాయి.చాలా మంది ఇళ్లల్లో కంకులు కట్టడం మానేశారు.అయినా, చిన్నప్పట్నుంచి ఇంట్లో ఆనవాయితీగా చేస్తున్న ఈపని మానడానికి ఇష్టపడరు చంద్రశేఖరం గారు.ఆయనకి ముప్పై ఆరు ఎకరాల పొలం ఉంది.బి.ఎస్.సి అగ్రికల్చర్ చదువుకున్నా, ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయంలో కుదురుకున్నారు.ఒక్కడే అబ్బాయి,పేరు విన్యాస్.అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు.భార్యా పిల్లలతో అక్కడే ఉంటున్నాడు.

మధ్యాహ్నం వరకూ వరి కంకుల్ని తినడానికి ఒక్క పిట్టా రాలేదు.ఆయన దానివైపే చూస్తూ కూర్చున్నారు.మూడున్నర దాటాక ఒక్క పిచ్చుకే వచ్చి,ధాన్యాన్ని పొడవడం మొదలెట్టింది.చేసిన పని అక్కరకు వచ్చినట్టు తృప్తిగా నిట్టూర్చారు చంద్రశేఖరం గారు.భార్య ఎదురుగా దివాన్ కాట్ మీద కూర్చుని ఉంది.

"ఒక్క పిచ్చుకే వచ్చింది,మెడ కింద చార ఉంది,మగ పిచ్చుకలా ఉంది.దీని జోడీ ఏమైనట్టు?"అంది రత్నవతి.

"మగ పిచ్చుకకి జోడీ కుదరాలంటే, గూడు కట్టడం బాగా వస్తేనే,ఆడ పిచ్చుక జత కట్టుద్ది"అన్నారు.

"ఇంట్లో పిల్లలు కూడా లేకపోయారు,మీకు వీటిని చూసే సంబరం"అంది.

"వచ్చేనెల మనవళ్ళతో వస్తున్నట్టు,ఫోన్ చేశాడుగా అబ్బాయి"అన్నారు.

"అవును,వాళ్ళు వచ్చేనాటికి,తిను బండారాలన్నీ చేసి ఉంచడానికి ఆదమ్మను రమ్మన్నాను"అంది.

"నువ్వు చేసేవి వాళ్ళకి నచ్చుతాయటే"అన్నారు చంద్రశేఖరం.

లోపలి అమ్మ మనసు నొచ్చుకుంది!దీనంగా ముఖం పెట్టి ఆయన వైపు చూసింది.

ఆయన నవ్వి,"వాళ్ళు తినకపోతే అందరికీ పంచాలి"అన్నారు

"అదీ మంచిదేగా,వీళ్ళు తిన్నన్ని వీళ్ళు తింటారు,మిగతావి అందరికీ తలా కొన్ని ఇచ్చేస్తాను"అంది.

ఉదయం కొంతసేపు వ్యవసాయ కార్యక్రమాలు అయ్యాక,రోజూ ఇద్దరికీ సావిట్లోనే కాలక్షేపం.

నాల్గు రోజుల తర్వాత౼

మగ పిచ్చుక,ఆడ పిచ్చుకని జతేసు కొచ్చింది.అవి రెండూ కంకుల మీద వాలి తింటుంటే,వీళ్ళిద్దరికీ సంబరంగా ఉండేది.అది అయిపోతే మరోటి కట్టడానికి ఇంకొకటి తయారు చేసి ఉంచారు చంద్ర శేఖరం గారు.

రోజూ వచ్చే వాటికి అప్పుడప్పుడూ నేలపై జొన్న గింజల్ని వేసేవారు.అవి భయం లేకుండా వీళ్ళ దగ్గరికంటా వచ్చి తినేవి.రెండోది కూడా కట్టేశారు చంద్రశేఖరం గారు.

సెలవులకి కొడుకు,కోడలు ఇద్దరు మనవళ్లు వచ్చేశారు.ఇల్లంతా సందడిగా ఉంది.రత్నవతి వాళ్ళకి కావాల్సినవి అన్నీ వండి పెడుతుంది. వాళ్ళు మూలన పడి ఉన్న కారుని,దుమ్ము దులిపి,రోజుకో చోటకి తిరిగొచ్చేవారు.

ఓ రోజు౼

చంద్రశేఖరం గారి పెద్ద మనవడు పిట్టల కర్ర(క్యాట్ పుట్)తో వచ్చి,గులక రాయిని దానిలో పెట్టి,గురి చూసి ఆడ పిచ్చుకని కొట్టాడు.అది అక్కడికక్కడే కింద పడి ప్రాణాలొదిలింది.

చంద్రశేఖరం గారు నొచ్చుకున్నారు."అవేం పిచ్చి పన్లు,జీవాల్ని అలా చంపుతారా!?"అని కేకలేసి,పిచ్చుక వైపు చూశారు. మగ పిచ్చుక దాని చుట్టూ చేరి,ముక్కుతో ఆడ పిచ్చుకని ఎగేస్తుంది.అది అప్పటికే ప్రాణాలొదిలింది,కిచ కిచ మంటూ మగ పిచ్చుక చేష్టలు,చంద్రశేఖరం గార్ని కదిలించాయి.ఆయన మనసు విల విల్లాడింది.మనవడి చేతిలోని పిట్టలకర్ర తీసుకుని అవతలకి విసిరేశారు.

"అయినా, అదేం పనిరా"అంది రత్నవతి.

కోడలు సౌభాగ్య"పిచ్చుకే కదా అది,దానికెందుకు కోప్పడి పోతారు,పదరా లోపలికి"అంటూ పిల్లాడ్ని లోపలికి తీసుకుపోయింది.

అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది.కోడలి మాటలు కన్నా,ఆడ పిచ్చుక చనిపోయిన విషయం ఆయన్ని కుదురుండ నివ్వలేదు.ఆడ పిచ్చుకని చేతుల్లోకి తీసుకుని,వాకిట బయట గొయ్యి తీసి,మట్టితో కప్పారు.ఆరోజు ఆయన అదోలా మౌనంగా ఉండిపోయి,రాత్రి భోజనం కూడా చేయలేదు.ఇలా జరిగిందేమిటా అని రత్నవతి కూడా చాలా మూలుక్కుంది. అరుగు బయట రోజూ వచ్చే కుక్కలకి అన్నం పెట్టేసి,నలతగా పడుకుందామె.

మర్నాడు౼

ఉదయాన్నే కొడుకు సావిట్లో కూర్చుని ఉన్నాడు.బయటి నుంచి వచ్చిన చంద్రశేఖరం,కొడుకు ముభావంగా ఉండటం చూసి,"ఏరా అలా కూర్చున్నావ్!?"అని అడిగారు.

"మీతో కొంచెం మాట్లాడాలి నాన్నా"అన్నాడు.

"అర్జెంటు విషయమా!?"అని అడిగారు.

"ఈ పిచ్చుకలకి,కుక్కలకి,ఊర్లో వాళ్ళకి అన్నీ పంచుతూ,ఎందుకు ఇవన్నీ,పొలమూ,ఇల్లు అమ్మేసి ఆ డబ్బు నాకు ఇచ్చేయండి.యూ.ఎస్.ఏ లో ఫుడ్ కోర్ట్ పెడతాను.మీకు సరిపడా నెల నెలా పంపించేస్తాను. వ్యవసాయాల మీద చాకిరి దండగ"అన్నాడు.

రత్నవతి వంట గదిలోంచి ఆ మాటలు విని నిర్ఘాంతపోయింది.చంద్రశేఖరం గారికి అంతా అర్థమైంది.

"మనకున్న దాంట్లో కొంత పెట్టడం వల్ల,నీకు కొరతేమొచ్చింది!లోటు ఏమీ లేదుగా!"అన్నారు చంద్రశేఖరం.

"దీని మీద ఆదాయం ఏం?వస్తుంది.అమ్మేసి ఈ డబ్బుతో అక్కడ ఫుడ్ కోర్ట్ ఏదైనా పెడితే బోల్డంత ఆదాయం"అన్నాడు.

"అన్ని జరుగుబాట్లు బావున్నప్పుడు,ఆస్తులు అమ్ముకోవాల్సిన పనిలేదు.నీ ఆదాయం నీకు సరిపోగా ఇంకా ఉంటుంది.ఎప్పట్నుంచో తరాలుగా వస్తున్న పొలాలు,ఇల్లు అమ్మేసి ఉనికి లేకుండా ఎలా అయిపోతాం!అయినా, మేము బతికుండగా,చేసుకోగల సత్తువ ఉండగా అది జరగని పని"కఠినంగా చెప్పేశారు చంద్రశేఖరం గారు.

"అయితే అమ్మరా!ఇలా పక్షులకి మేతేసుకుంటూ కూర్చుంటారు!"అనేసి లేచెల్లి పోవడానికి సిద్ద పడ్డాడు.

"ఈభూమి ఎప్పుడూ ఎవరి స్వంతం కాదు.మన చేతిలో ఉన్నన్నాళ్లే మనది.అలాగే ఈభూమిపై అన్ని జీవరాశులకి హక్కు ఉంది.,మనుషుల ఒక్కరికే స్వంతం కాదు.పుట్టిన ప్రతి జీవిది. అన్ని జీవుల్ని బతకనివ్వాలి.అప్పుడే!ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది.నువ్వూ చదువుకున్నావు కదా!చైనాలో పిచ్చుకల వల్ల పంటలకి హాని జరుగుతుందని,నాలుగు సంవత్సరాల్లో ముప్పయి లక్షల పిచ్చుకల్ని చంపేస్తే,కరువు బారిన పడి నాలుగు కోట్ల మంది చనిపోయాక ప్రభుత్వానికి తెలిసొచ్చింది పిచ్చుకల విలువేమిటో!అనువంశికంగా వస్తున్న ఈ పద్ధతులు నీకు చిరాకు కల్గుతున్నాయేమో!అర్ధం తెలిసిన వాళ్ళకి కాదు!మా పనులు అతిగా కన్పించి,పొలం,ఇల్లు అమ్మకం వరకూ వెళ్లిపోయావేం!?"అన్నారు చంద్రశేఖరం.

కొడుకు అక్కడ్నుంచి లెచెళ్లిపోయాడు.గది లోంచి గంట తర్వాత భార్యా పిల్లలతో సూట్ కేసులు పట్టుకుని బయటికి వచ్చారు.

"మేం వెళ్లిపోతున్నాం!మా మాట నెగ్గని చోట,విలువ లేనిచోట మేమెందుకు!"అంటూ బయటికి నడిచారు.

రత్నవతి వారించ బోయింది.లెక్క చేయనట్టు కోడలు ముందే బయటికి నడిచింది.కూడా పిల్లలూ ముందుకెళ్లిపోయారు.చంద్రశేఖరం గారు ఏమీ మాట్లాడలేదు.మౌనంగా ఉండిపోయారు.లోలోపల మనసులోని బాధని అంత తొందరగా బయట పడనీయలేదు.రత్నవతి మాత్రం వాళ్ళెళ్లి పోయాక,రోదిస్తూ కూర్చుండిపోయింది.

చంద్రశేఖరం గారు సావిట్లో కింద కూర్చుండిపోయిన రత్నవతిని, రెండు భుజాలు పట్టుకుని పైకి లేవదీసి, దివాన్ కాట్ మీద కూర్చోబెట్టి,ఓదార్చి"ఇలాంటివి అన్ని వేళలా మనకి అనుకూలంగా సాగవు,మన సమూహాల్లోకి కొత్త వారొచ్చినపుడు,అల్ల కల్లోలాలు సహజం,మనం దేనికీ బెంగ పడకూడదు.కాలం కల్సొస్తే అన్నీ సర్దుకుంటాయి.మన తప్పుంటే బాధ పడాలి,అర్ధం చేసుకోలేని వాళ్ళ గురించి అతిగా ఆలోచించడం మరో అనర్ధం"అంటూ రత్నవతికి హిత వాక్యాలెన్నో చెప్పి,ఆమె మనసు కుదుట పర్చారు.

వాలు కుర్చీలో కూర్చుని"రత్న టీ తీసుకురా!"అన్నారు.

ఆమె లోనికెళ్లింది.ఆయన కాలు ముడికిలి మీద పిచ్చుక వాలింది.ఆయన దాన్నే చూస్తుండిపోయారు. ఆడ పిచ్చుక చనిపోయాక,ఇదేమి సరిగా తింటున్నట్టు కన్పించలేదు. కుర్చీ పక్కన డబ్బా లోంచి కొన్ని నూకలు బయట జల్లారు అది తింటుందని.పిచ్చుక కొన్ని గింజల్ని తింది. పక్కనే గాజు పాత్రలో నీళ్లు పెట్టారు.

పిల్లలు వ్యతిరేఖిస్తేనే ఇంతగా బాధ కలిగింది.పగ,ప్రతీకారం తీర్చుకోలేని,తన జోడుని కోల్పోయిన ఈ పిచ్చుక బాధ వర్ణనాతీతం అన్పించింది చంద్రశేఖర్ గారికి.దాని వైపే జాలిగా చూస్తుండిపోయారు.

రత్నవతి టీ తెచ్చి ఇచ్చింది.

ఒక వారం పోయాక౼

కొడుకు దగ్గర్నుండీ ఫోన్ వచ్చింది.తన వాటా ఆస్తి ఇచ్చెయ్యమని,తల్లికి చెప్పి ఫోన్ పెట్టేశాడు.

చంద్రశేఖరం గారు యూ.ఎస్.ఏ నుండి కొడుకువి అధరైజ్డ్ ఫామ్స్ తెప్పించి,ఉన్న ముప్పయి ఆరు ఎకరాల పొలాన్ని,సగం వాటాగా పద్దెనిమిది ఎకరాలు కొడుకుకి రాసేశారు. ఆస్తి గురించి కొడుకు అడగటానికి లేకుండా అన్నీ చేసేశారు. ఆయన ఉంచుకున్న భాగంలో పదెకరాలు వరి, ఎనిమిది ఎకరాల్లో జొన్న కంకులు ఉన్నాయి.

రాసేసిన పొలాన్ని కొడుకుని చూసుకోమని కబురు పంపించేశారు.కొడుకు బావమరిది ద్వారా వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చేశాడు.శేఖరం గారు పనున్నా,లేకపోయినా రోజూ పొలం వెళ్లి ఆ పచ్చని భూమిలో అడుగు పెట్టకపోతే ఆయనకు తృప్తిగా ఉండదు.కల్మషం లేని ఈ నేల మీదే అన్నీ ఉంటాయి.భూముల్ని కాపాడుకుంటూ వాటి మీదే బతకొచ్చు!అత్యాశతో అంబరం ఎక్కాలని చూడొద్దని చెప్పేవారు విన్యాస్ కి.అయినా, పట్టుబట్టి వెళ్ళిపోయాడు.

చిన్నప్పట్నుంచి పెరిగిన ఈ ఊర్లో మమకారాలతోను,ఆత్మీయులతోను పెనవేసుకుపోయిన బంధం ఇది.సహజాన్ని కోల్పోయిన పట్నాలు ఆయనకి నచ్చేవి కావు.ఊర్లో ప్రతి ఇల్లూ, ప్రతి చెట్టూ, ప్రతి గట్టూ ఆయనకి మనసులో ప్రింట్ లాగుంటుంది.

ఆరోజు౼

ఇద్దరూ సావిట్లో కూర్చుని ఉండగా,రత్నవతి కొడుకు గురించి చాల బాధ పడింది.ప్రేమాభిమానాలు వదిలి,ఆస్తుల గురించి కొట్టు మిట్టాడటం, చిన్నప్పట్నుంచి పెంచిన మమకారాన్ని తన్నుకు పోవడం ఆమెకు ఓ కలలా కన్పిస్తూ ఉంది.

"ఎటువంటి స్వార్ధమూ,తల్లి తండ్రుల్ని తల దన్నేదిగా ఉండకూడదు రత్న.పేగు బంధాల్ని మనం పెనవేసుకుపోతాం,పైసలతో వాళ్ళు యాంత్రికమైపోతారు.అతి చులకనగా వ్యక్తిత్వం ఉండకూడదు.భార్య మీద ప్రేముండొచ్చు,మనల్ని మనం క్షీణించే స్థాయికి ఆ ప్రేమ మితిమీర కూడదు.ఎవరి జీవితాల్ని కడవరకూ తీర్చి దిద్దగలం,కొంత వయసొచ్చే వరకూ సాకుతాం కానీ!"అన్నారు చంద్రశేఖరం.

"అవునండీ!తర్వాతైనా ఈ ఆస్తంతా వాళ్లదే,కానీ!సంప్రదాయ బద్దంగా,ఊర్లో పరువు ప్రతిష్ఠల్తో ఉండే మనల్ని,ఏదోక లొంగు బాటులకి లోనై,విచక్షణా జ్ఞానం లేకుండా ఇలా చేస్తాడనుకోలేదు"అంది రత్నవతి.

"మనం బాగా చదివించాం, లోటు లేకుండా పెంచి,తన కాళ్ళ మీద నిలబడేలాగా చేశాం. అయినా, యాంత్రిక బంధాల్లా,ఈ ఆస్తి కోసమే అన్నట్టు ప్రవర్తించడం వాడి తప్పే!ఏ బంధం గురించీ మన మంచి స్వబుద్ధిని కోల్పోకూడదు రత్న!వాడి ఆలోచన్లు పెట్టుకోకు!మనం మనలాగే ఎప్పుడూ ఉండాలి!"చంద్రశేఖరం గారన్నారు.

"ఎంతైనా అమ్మను కదండీ!"అంది.

చంద్రశేఖరం గారు భుజాల్ని తట్టి,"దిగులు పడకు,మనం మంచి బుద్ధితో ఉంటే మంచే జరుగుతుంది.ఇవన్నీ తాత్కాలికమే,కాలం అన్నిటినీ సమాధాన పరుస్తుంది"అన్నారు.

ఒకరోజు౼

పొలంలో తిరుగుతూ,తూము అవతల వేరే భాగంగా ఉన్న జొన్న చేలో పక్షుల కిచ కిచలు విన్పించాయి.దగ్గరికంటా వెళ్లి చూశారు. చుట్టు పక్కల అప్పటికే చాలా కోత కోసేశారు.దానితో పిచ్చుకలన్నీ సెపరేట్ గా ఉన్న,తూము అవతల రెండెకరాల్లో ముందటి మీద ఎక్కువయ్యాయి.చంద్రశేఖరం గారు ఆ రెండు ఎకరాలు వదిలేసి,మిగిలిన భాగం కోత మొదలెట్టారు.పొలం చుట్టూ ఉన్న తుమ్మ,తంగేడు చెట్లకి గూళ్ళు కట్టుకుని కోలాహలంగా ఉన్నాయి.ఆయనకి సంతోష మేసింది.

సాయంత్రం ఇంటికి వచ్చి,"రత్న మన తూము అవతల రెండెకరాల జొన్న తోటలో అన్నీ పక్షులే, పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని అక్కడే ఉంటున్నాయి.దాన్ని వదిలేశాను. మనకి లోటేముంది!అది తీసేస్తే అన్ని ప్రాణాలు అతలాకుతలం అయిపోతాయి,నోటి కాడ కూడులేక గిల గిల మంటాయి"అన్నారు

రత్న ఏమి మాట్లాడలేదు.ఆయన మనసు తెలిసిన ఆమె,ఏం!చేసినా,ఆలోచించే చేస్తారనే నమ్మకం"సరే అండి!"అంది మెచ్చుకోలుగా.

"ఏ ఆస్తి గొడవ లేకుండా,కేవలం తిండికే పాకులాడుతాయి,పొలాల్లో కీటకాల్ని తింటూ,రైతులకి మేలు చేస్తాయి.ఈ మనుషులకే బతకడానికి సరిపోయినా, తరాలకి కూడ బెట్టాలని ఆశ"అన్నారు వాలు కుర్చీలో కళ్ళు మూసుకుని.

రత్నవతికి ఆయన లోలోపలి అంతరాత్మ అర్ధమైంది.

"ఒక మంచి పని చేశారండి, కూడు పోగొడితే పాపం కాని, ఇంత ఆహారం పెడితే చెడే ముందండి"అంది.

"అయినా, భగవంతుడు బతకడానికి ఏ లోటు ఇవ్వలేదు కదా రత్న"అన్నారు.

ఆమె భర్త వైపు ప్రేమగా చూసింది.పెళ్ళైన దగ్గర్నుంచి ఆయన ఆలోచన్లు,భావాలు ఆమెని కట్టి పడేశాయి.

చంద్రశేఖరం గారు రెండెకరాలు పిచ్చుకలకి వదిలేయడం,ఊర్లో అందరికీ మాట్లాడుకోవడానికి ఓ అంశం దొరికినట్టయింది. చంద్రశేఖరం గారి తెగువ,ఊరకనే పక్షులకి వదిలేయడం కొంతమందికి ఆశ్చర్యంగానూ, ఆయన స్వభావం తెలిసిన వాళ్ళు,ఎప్పుడూ మంచే చేస్తాడీయన అంటూ ఉంటే,ఊరంతా పొక్కిపోయింది.

అందరి పంటలు కోసేసి,ఈ రెండెకరాలే ఉండిపోవడంతో పక్షులన్నీ అక్కడికి చేరిపోయాయి.పైగా,బోరు మోటారుతో రోజూ క్రమం తప్పకుండా నీళ్లు వదలడం చంద్రశేఖరం గారి పని.

పంటలు వేసేనాటికి,తరిగి పోతున్న జొన్న కంకులకి బదులు తూము ఇవతల రెండెకరాల్లో పక్షులకి రాగుల్ని వేసేసి,అవి పక్వానికొచ్చి,పక్షులన్నీ ఇటు తిరిగాక,జొన్న ఖాళీ చేసి,పక్షులకి తర్వాత పంటకి తయారు చేసి ఉంచారు.దానితో ఆయన చేస్తున్న పని ఈనోట,ఆనోట పక్క ఊర్లకి పాకింది.

కొందరు రైతులు పక్క గ్రామాల్లోంచి చూడ్డానికి రావడం,ఆయన్నొక సారి కల్సి వెళ్లడంతో చంద్రశేఖరం,రత్నవతిలకు మంచి పని చేస్తున్నామనే తృప్తి కలిగింది.ఊర్లో అందరూ హారతి పట్టారు.

అప్పటికి౼

ఆగకుండా ఏడేళ్లు సాగించారు.

తర్వాత కూడా అది అలాగే కోసాగాలని ఆయన మనసులో ఆలోచన స్థిరపడింది.

"రత్న,పద్దెనిమిదెకరాల్లో నాలుగెకరాలు పక్షులకి రాసిచ్చేస్తాను.మిగతాది మన తదనంతరం విన్యాస్ కి వెళ్తుంది."అన్నారు.

"అప్పుడే రాసేటంత తొందరేమొచ్చింది"అంది రత్న.

"ఆరోగ్యం బావుండటం లేదు కదా,అబ్బాయి మనతో సరిగా మాటలు లేకుండా ఉన్నా, కబురు పంపిస్తాను,వాడి బావమరిది తో,వీలు చూసుకుని రమ్మని"అన్నారు.

రత్నవతి ముఖం బేలగా అయింది."దేవుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని,ఆరోగ్యం గురించి దిగులెందుకు?"అంది.

"అన్ని రోజులూ మనవి కావు రత్న!"అన్నారు.

"అయితే అబ్బాయి పేర రాసేస్తారా"అంది.

"వీలునామా రాస్తాను,మన తదనంతరం అని"అన్నారు.

కబురెళ్ళాక ఒక నెలకి ఊడిపడ్డాడు విన్యాస్.విషయం తెలుసుకుని, పక్షులకి రాసే నాలుగెకరాల గురించి గట్టిగా అడిగాడు తండ్రిని."పక్షులకి రాసి ప్రయోజనం దేనికీ!?వాటికి రాయొద్దు!మొత్తం నా పేర్న రాసేయండి."అన్నాడు.

ఇదేరా నా నిర్ణయం!మిగతాదే రాస్తాను.ఉన్న ముప్పయి ఆరు ఎకరాల్లో నా కష్టార్జితం ఎనిమిదెకరాలు, మిగతాది మీ తాత నుండి వచ్చింది.నా కష్టార్జితాన్ని నేను పూర్తిగా వాడుకోవచ్చు!కానీ,సగం నీకు రాసి,మిగతాది పక్షులకు రాయాలనుకున్నాను"అన్నారు.

విన్యాస్ ఏమి మాట్లాడలేదు.సెలవు పెట్టి వచ్చిన ఇరవై రోజులు తండ్రి మీద కోపంతో ముభావంగా గడిపాడు.చంద్రశేఖరం గారు పక్షులకని నాలుగెకరాలు పంచాయితీకి,ఆహారం నిమిత్తం వాడేలా రాసేసి,మిగతా పద్నాలుగు ఎకరాలు వాళ్ళ తదనంతరం కొడుక్కి చెందేలా లాయరు సహాయంతో వీలునామా రాసి రిజిస్టర్ చేయించారు.

ఆ సంవత్సరం౼

మీడియా దృష్టిలో పడి, పేపర్లలోనూ, టీ.వి ఛానళ్ల లోనూ పిచ్చుకలకని భూమిని వదిలిన చంద్రశేఖరం గారి గురించి ప్రముఖంగా వార్తల్లో వచ్చి,పిచ్చుక పేరు ఉచ్చరించగానే చంద్రశేఖరం గారి పేరు నోట్లో నానేంతగా పెద్ద చర్చనీయాంశం అయింది.

మీడియాలో చంద్రశేఖరం గారి పక్షుల కధ విరివిగా చూపించేసరికి, నాసిక్ నుండి ది నాచుర్ ఆఫ్ సొసైటీ(sos save our sparrow),సలీం ఆలీ సెంటర్ ఫర్ ఆర్నితాలజీ(ముంబాయి)వాళ్లు, రత్నపురం లోని చంద్రశేఖరం గారి పొలానికి విచ్చేశారు.

డైరెక్టర్ గారితో ఇంకో ఐదుగురు వచ్చారు.వాళ్ళతో ఊర్లోని రైతులు కలిసి తిరిగారు.ఫోటోలు తీశారు.చంద్రశేఖరం గారి గురించి చాల విషయాలు అడిగారు"ఇలా ఎన్ని సంవత్సరాల నుండి?"అని డైరెక్టర్ గారు అడిగారు.

ఒకాయన తెలుగులో అడుగుతూ,ఇంగ్లీష్ లో డైరెక్టర్ గారికి తర్జుమా చేసి చెప్తున్నాడు.

"ఏడు సంవత్సరాల నుండి"ఒక రైతు చెప్పాడు.

"మీకేమనిపించింది"అని అడిగారు.

ఒక రైతు"అప్పటికీ ఇప్పటికీ తేడా బాగా కనిపించిందండి.మా ఊరు,పక్కలా పొలాల్లో పెట్టె పెట్టుబడి తగ్గింది.ఇది వరకు కీటకనాశిని ఎక్కువ వాడే వాళ్ళం,దాని వాడకం తగ్గి దిగుబడి పెరిగింది.ఇక్కడుండే వందల వందల పక్షులన్నీ పొలాల్లో కీటకాల్ని హరిస్తున్నాయి.ప్రతి సంవత్సరం ఇక్కడ పక్షులు వృద్ధి చెందాయి,వాటి సంఖ్య పెరిగే కొలదీ మాకు నష్టం కలగలేదు.పెట్టుబడి తగ్గి,దిగుబడి పెరిగింది.ఇలా పెరగడం మాకూ ఆశ్చర్యంగానే ఉంది.చంద్రశేఖరం గారికి పక్షుల మీద ప్రేమే అనుకున్నాం,వాటి నన్నిటిని ఒక చోటకు చేరిస్తే,రైతుకి కలిగే లాభం మా జీవితాల్లో చూశాం"అంటూ అనర్గళంగా చెప్పుకు పోయాడు.

అంతా విన్న డైరెక్టర్ గారు ఆశ్చర్యానికి లోనయ్యారు.పక్షుల్ని కాపాడుకోవాలి వాటికీ ఈ భూమ్మీద బతికే హక్కుంది.ప్రకృతిలో ఉనికై యున్న ఏ జీవి అంతరించ కూడదని నినాదం తీసుకెళుతున్నాం.అయినా, వాటి స్వప్రయోజనాలు,ప్రకృతికి,ఈ సమస్త జీవరాశికి అవినాభావ సంబంధం ఇప్పుడు కళ్ళతో చూస్తున్నట్టనిపించింది ఆయనకి.

అక్కడంతా చంద్రశేఖరం గారి గురించి,పక్షుల మీద ఆయన చూపించే ప్రేమ గురించీ గొప్పగా చెప్పారందరూ.

వాళ్లంతా చంద్రశేఖరం గారి ఇంటి కొచ్చారు.ఆయనతో చాలా సేపు మాట్లాడారు.ఆయన చేసిన పనిని అందరూ అభినందించారు.వాళ్ళని భోజనాలు చేస్తేనే కానీ,చంద్రశేఖరం గారు వెళ్ళనివ్వలేదు.ఇంట్లో కట్టిన వరి కంకులపై వాలిన పిచ్చుకలకి ఫోటోలు తీశారు"మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని"అంటూ వీడ్కోలు చెప్తూ కారెక్కారు.

ఊర్లోని పొలాలన్నీ దిగుబడి పెరిగాయి,దానికి కారణం పిచ్చుకలు ఎక్కువగా ఉండటం వల్ల, పొలాల్లో కీటకాల్ని తినేయడం.ఊర్లో రైతులందరు ఇన్ని సంవత్సరాల్లో ఈ విషయం గ్రహించేరు.ఎప్పుడూ మంచి విషయాలు వినడమే కానీ,అవి అనుభవ పూర్వకంగా ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది.

అన్నీ బాగున్నా, చంద్రశేఖరం గారికి కొడుకు గురించి కొంచెం బాధగా ఉండేది.మానవతా విలువలు లేని కొడుకు పదే పదే జ్ఞాపకమొచ్చి,తన పెంపకంలోని ఏ లోపం ఏర్పడిందోనని ఆలోచన్లు చేసుకునేవారు.జరిగిపోయిన కాలాన్ని,ఏవైనా తప్పులున్నా సరిదిద్దలేమని నిరాశ చెందేవారు.

క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది.ఆయనకి జీవితంలో అన్నీ బానే జరిగాయి.షుగరు వచ్చాక,దానికి తోడు మనో బెంగ పుడితే,ఎలా అయిపోతారో!అలా అయి, చంద్రశేఖరం గారు ఇది వరకటిలా కులాశాగా తిరగ లేకపోతున్నారు.పొలాన్ని పాలే గాళ్లతో నడిపిస్తున్నారు.

రత్నవతి కూడా బెంగగా ఉంటుంది.మంచి మనసులు ఉన్నా, భగవంతుడు కొందరికి ఇలా చేస్తాడెందుకో!అనుకుంటూ మూలుక్కునేది.

ఓ రోజు రాత్రి౼

చంద్రశేఖరం గారికి అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది.ఊర్లో వాళ్ళు వెంటనే కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు ఆయన ప్రాణం విడిచారు.

రత్నవతి కుప్పకూలింది.భోరున ఏడ్చింది,తట్టుకోలేకపోయింది.ఆయనే సర్వస్వమై, ఆమెను ప్రేమగా చూసుకునే చంద్రశేఖరం గారు లేరనే విషయం నమ్మలేనంతగా గుండెల్ని బాదుకుంది.అందరూ ఆమెని పట్టుకున్నారు.జీర్ణించుకోలేని ఆమె కన్నీటి ధారల్ని వల వల కారుస్తుంది.జీవితంలో ఆయన లేని ప్రతి క్షణమూ ఆమెను ఎక్కిరిస్తున్నట్టుంది.ఆయన లోని దిగులే, ఆయన్ని మింగేసింది.కొడుకుకి డబ్బు మీద,భార్య మీద వ్యామోహం,ఆమె మాటల్ని అనుసరిస్తూ,భర్త విచారానికి కారణమైన కొడుకు మీద ఒకవైపు కోపమూ, తండ్రి లేని అతని మీద జాలి రెండూ కలగలసి రత్నవతి ముఖం అదోరకంగా ఉంది.

ఆయన శరీరాన్ని ఐస్ బాక్స్ లో పెట్టారు.ఉదయానికల్లా, కొడుకు,కోడలు,పిల్లలు వచ్చేశారు.

విచారంగా ఉన్నట్టున్నా, కొడుకు విలపించినట్టుగా కనబడలేదు.కార్యక్రమాలకి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఆయన భౌతికదేహం వెంట ఊరంతా కదిలింది.చుట్టు పక్కల చాలా ఊరి జనాలతో ఆయనకి అంతిమ యాత్ర చేశారు.

పెద్ద కార్యం వరకూ, వచ్చి పోయే జనంతో ఆ ఇల్లు హోరెత్తింది.ఆయన మంచితనం,మానవత్వం,పలుకుబడి చాలా మందికి కన్నీరు తెప్పించింది.కోడలు సౌభాగ్యకు వచ్చిపోయే జనాన్ని చూసి మతిపోయింది.ఒక మాములు వ్యక్తికి వచ్చే జనం కాదు!అసాధారణమైన వ్యక్తిత్వం ఉంటేనే కానీ,జనం ఇలాంటి సమయాల్లో కన్నీళ్లను చెమర్చరు.

అంతా అయ్యాక కూడా,నెల రోజులు ఉండటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు కొడుకు.తర్వాత కూడా ఎవరో ఒకరు పరామర్శ చేస్తూనే ఉన్నారు.రత్నవతి మౌనంగా ఉండిపోయింది.ఇదివరకటిలా లేదు.కొడుకుతో కూడా సరిగా కలబోసుకుని మాట్లాడటం లేదు.జీవితానికి విలువేముంది.అందరూ ఇంతే కదా అన్నట్టుంది ఆమె వాలకం.

ఆరోజు౼

కేంద్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుతో ఐ. ఏ. ఎస్ ఆఫీసర్ ఒకాయన వచ్చారు.ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డ్స్ లో అంతరించి పోతున్న పిచ్చుకల్ని మెరుగు పర్చడానికి చేసిన సేవకు గానూ, చంద్రశేఖరం గారి పేరున్నట్టు చెప్పారు.ఇంకో రెండు వారాల్లో జరిగే కార్యక్రమానికి ఆయన తరపున వచ్చి పద్మభూషణ్ అవార్డ్ తీసుకోవడానికి ఢిల్లీ రావాలని ఉంది.

అందరికీ ఒక పక్క సంతోషం,మరో వైపు బాధ.కొన్ని రోజులు ఉండుంటే చంద్రశేఖరం గారు ఆయన చేతుల మీదుగా తీసుకునే వారు.ఆరోజు రత్నవతి గుక్క పెట్టి ఏడ్చింది.ఊరుకో బెట్టడం ఎవరి వల్లా కాలేదు.మర్నాడు పేపర్లలో ఆయన ఫోటో వేసి,ప్రముఖంగా వేశారు.ది నేచర్ ఫోరెవర్ సొసైటీ వాళ్ళు కూడా ఈ సంవత్సరపు లిస్టులో చంద్రశేఖరం గారికి స్పార్రో అవార్డ్ ఇస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గౌరవార్ధం,ఆయన లేకపోయినా,ఆ ఊర్లోనే సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఊర్లో రైతులందరూ ఏకమై ఆయనది శిలా విగ్రహం పెట్టాలని,ఆలోచించి తీర్మానం చేసుకున్నారు.ఊరి మధ్యలో హై స్కూల్ స్థలంలో ఆయనకి గుర్తుగా అన్ని అనుమతులతో శిలా విగ్రహాన్ని నిర్మించి,ఆవిష్కరణకు తయారు చేశారు.

ఢిల్లీ లోని రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకోవడానికి కొడుకు విన్యాస్ వెళ్ళాడు.అటు నుంచి తిరిగి రావడంతోనే మూడు రోజులకి ఊర్లోని హై స్కూల్ గ్రౌండ్ లో చంద్రశేఖరం గారి శిలా విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగడానికి సమాయత్తమైంది.అదే సభలో స్పార్రో అవార్డ్ ఇవ్వడానికి కార్యక్రమం రూపొందింది.

ఊరంతా పండుగ వాతావరణంలా ఉంది.భారీ సభ ఏర్పాటైంది. చుట్టు పక్కల ఊళ్ళన్నీ అక్కడే ఉన్నాయి.ముఖ్యమంత్రితో పాటు,పరివారం,మంత్రులు,ది నేచర్ ఫోరెవర్ సొసైటీ డైరెక్టర్ అందరూ వచ్చేశారు,సభ ప్రారంభమైంది.విన్యాస్ ముందు వరుసలో కుటుంబంతో కూర్చున్నాడు.రత్నవతి అక్కడికి రానని చెప్పింది"ఆయన లేనప్పుడు అవన్నీ నాకెందుకు,అవి ఆయన్ని తీసుకురాలేవు కదా"అంది.

అయినా కొంతమంది ఆమెను బలవంతంగా సభ ముందుకు తీసుకు వచ్చారు.

సభ ప్రారంభమయ్యి,ఉపోద్ఘాతాలు అయ్యాక,అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం మొదలైంది.రత్నవతిని, ఆమె కొడుకుని పైకి ఆహ్వానించారు.ఆమె రానని,కొడుకుని వెళ్ళమంది. ఇవన్నీ పై నుంచి ముఖ్యమంత్రి చూస్తున్నారు.

విన్యాస్ తో పాటు,కొంతమంది ఆమెని స్టేజి పైకి తీసుకెళ్లారు.ముఖ్యమంత్రి గారు మైకు తీసుకున్నారు"కొంతమంది సమాజంలో కారణ జన్ముల్లాంటి వారు.మన చంద్రశేఖరం గారు కూడా అలాంటి వారే.ఆయన పుట్టుకకు ఈ ఊరు అదృష్టం చేసుకుంది.అభివృద్ధి అంటూ మనం ముందుకు పోతూ ఉంటాం,ప్రకృతి సమతుల్యత చెడిపోతే,అది మానవాళి వినాశనానికి దారితీస్తుంది.అలాంటివి చెడిపోకుండా మనకి గుర్తు చేస్తూ,జీవితాల్ని అంకితం చేసి,ఇలాంటి మహానుభావులు కాపాడుతుంటారు.అలాంటి వ్యక్తికి భార్యగా ఉన్న మీరు కూడా మా అందరికీ ఆదర్సమే,తెలుగు నేల చేసుకున్న అదృష్టం"అంటూ మైకు పక్కన పెట్టి,అన్నీ మర్చిపోయి,ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రత్నవతి పాదాలకి నమస్కరించారు.

సభ హోరెత్తింది.ప్రశంసల వర్షం కురిసింది.విన్యాస్ ని"ఆయనకి పుట్టడం మీ అదృష్టమే కాదు,ఆయన సేవల్ని మీరు ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాం,మరో విషయం ఈరోజు నుండి మనకి జ్ఞాపకంగా,భావితరాలకి ఆదర్శంగా ఉండటానికి ఈ ఊరు పేరుని పిచ్చుకలూరు గా మారుస్తున్నాం!మీ అందరికీ అంగీకారమేనా!?"అని అడిగారు.

సభలో జనం ఈలలతో, చప్పట్లతో సమాధానం చెప్పారు.

ఊర్లో కొంతమంది రైతులు అనుమతి తీసుకుని స్టేజి మీదకు వచ్చారు."ఈరోజు మేం ఓ నిర్ణయం తీసుకున్నాం,మా పెద్ద రైతులందరూ తలా కొంత భూమి పక్షులకి వదిలేయాలనుకుంటున్నాం.వదిలేసిన భూమిని పక్షులకు మాత్రమే అని ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తాం"అని వారిలో ఓ రైతు చెప్పగానే, జనమూ, స్టేజి మీద అందరూ అద్భుతాన్ని చూస్తున్నట్టు నిశ్శబ్దమై తేరుకున్నారు.

ఆ రైతులందర్నీ స్టేజి మీద సన్మానించారు.వారి పేర్లు కూడా,చంద్రశేఖరం గారి శిలాఫలకం కింద వేయమని ముఖ్యమంత్రి గారు సూచించారు.

అనంతరం శిలా విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగింది.పూల మాలలతో ఆయన్ని అలంకరించారు.సభ మళ్ళీ ప్రారంభమైంది.

ది నేచర్ ఫోరెవర్ ఆఫ్ సొసైటీ డైరెక్టర్"మేము చాలా అదృష్టవంతులం,ఈ ఊరు చూడ్డానికి వచ్చినపుడు చంద్రశేఖరం గార్ని కలిసే అదృష్టం కల్గింది.వారి ఆత్మీయ స్వాగతం మాకు లభించింది.ఇది మేము మరువలేనిది.చంద్రశేఖరం గారు చేరదీసిన పక్షుల్ని చూసాక,నాకొక విషయం స్ఫురించింది.ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వం పక్షులకి ఇలా కొంత భూ భాగం పంటతో వదిలేయడం, ఆ ఊరి పొలాలతో పాటు,ప్రకృతి సమతుల్యత కలిగి,రసాయనాల వాడకం కూడా తగ్గుతుంది.ఇది సభా ముఖంగా ముఖ్యమంత్రి వర్యులను పరిశీలించమని అభ్యర్ధిస్తున్నాను"అంటూ ఇంగ్లీష్ లో తన ప్రసంగాన్ని ముగించారు.

తరువాత ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్పార్రో అవార్డ్,ఏభై వేల రూపాయల నగదు రత్నవతికి బహుకరించారు.

ఘనంగా సభ ముగిసింది.అందరూ అక్కడ్నుంచి బయలు దేరారు.రత్నవతిని,పిల్లల్ని,కోడల్ని ఇంటివద్ద దింపేశారు.విన్యాస్ అందరితో మాట్లాడి,ఆఖరున ఇంటికి బయలు దేరుతుండగా కొటేశ్వరరావు గారు విన్యాస్ ని ఆపి,"రెండు నిముషాలు ఆగు,వెల్దువు గాని"అన్నారు.

కోటేశ్వరరావు చంద్రశేఖరం గారి అతి సన్నిహితుడు,బాల్య స్నేహితుడు.చంద్రశేఖరం గారి విషయాలన్నీ కోటేశ్వరరావు గారికి తెలుసు!ఇంట్లో అంతర్గతంగా జరుగుతున్న ప్రతీది ఆయనకు చెప్పకుండా ఉండరు.

"ఏమిటంకుల్!?"అని అడిగాడు విన్యాస్

"నీకో విషయం చెబుదామని, మీ నాన్న గురించి నాకు తెలియంది ఏమీ లేదు.చాలా పరోపకారి,చిన్నప్పట్నుంచీ అంతే!ఆ గుణమే ఈరోజు ఇలాంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది!ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఇలాంటిది.ఆఖరిలో నీ వల్ల బాధ పడ్డాడు.ఆ క్షోభ లేకపోతే ఇంకా ఉండునేమో అన్పిస్తుంది.శిలా విగ్రహం పెట్టేవరకు ఆయన వ్యక్తిత్వం,దాతృత్వం వెళ్లిందంటే చూడు!వాడికి నువ్వెలా పుట్టావో అర్ధం కాదు.ఈ డబ్బుని కూడా పట్టుకెళ్ళం!మీ నాన్న తీసుకెళ్లాడా!?నువ్వూ తీసుకెళ్లవ్!నీ కొడుకులు నిన్ను ఇలాగే హింసిస్తే,నీ సంపాదనకు అర్ధం లేదు!ఎలాంటి వాడ్రా మీ నాన్న!వేలెత్తి చూపించగలవా ఏవైనా లోపాన్ని!అర్ధం చేసుకో!గొప్ప వాడికి పుట్టాననే విషయం గ్రహించు!ఈ రెండు ముక్కలు నీకు చెప్పాలనిపించింది"అనేసి ఆయనెళ్లిపోయాడు.

విన్యాస్ లో ఆలోచన్లు రేగాయి,తన తండ్రికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు, ఆయన చేసిన సేవ,ఇవన్నీ చిత్రాల్లా మెదిలాయి.ఆలోచన్లతో ఇంటి కెళ్ళాడు. అత్యాశ,పక్క మాటల్తోనూ నడిస్తే ఎలా ఉంటుందో,తండ్రి ఆదర్శంలో నడిస్తే ఎలా ఉంటుందో ఉహకి వచ్చింది.అప్పుడెందుకో తండ్రి ఆలోచన్లు కలిగి కళ్ళు చెమ్మగిల్లాయి.సావిట్లో సోఫాలో కూర్చుని మౌనంగా ఉండిపోయాడు.

విన్యాస్ లోపలి గదిలో తల్లి దగ్గరకు వెళ్ళాడు.నిశ్శబ్దంగా ఆమె కాళ్ళ దగ్గర చతికిల బడిపోయాడు.బిడ్డ మనసెరిగిన తల్లి మనసు విన్యాస్ తలని రెండు చేతుల్తో దగ్గరికి తీసుకుంది.అలవోకగా ఆమె రెండు కాళ్ళను తన రెండు చేతుల్తో చుట్టేశాడు విన్యాస్

"నువ్వు నాన్న గారి ఆశయాల్ని ముందుకు తీసుకు వెళ్ళు, అదే నాన్న గారి ఆత్మకు కలిగే శాంతి"అంటూ విన్యాస్ తలని తన చేతితో నిమిరింది ఆమె.

విన్యాస్ తన చేతుల్తో మరింత ఒడిసి పట్టుకున్నాడు ఆమె కాళ్ళని.

రత్నవతికి 'ఇవన్నీ తాత్కాలికమే,కాలం అన్నిటినీ సమాధాన పరుస్తుంది'అన్న ఆయన మాటలు పదే పదే గుర్తొచ్చాయి.

మంచి ఆశయంతో నడిచే వాళ్ళు,వందల మందికి దివిటీలవుతారు!

(పక్షుల్ని ప్రేమిస్తూ,వాటి తోడ్పాటుకి పాటుపడే అందరికీ నా ఈ కధ అంకితం. ౼రచయిత)

(2020 సంవత్సరం ఎన్.జి రంగా సాహిత్య పురస్కారం పదివేల రూపాయల బహుమతి పొందిన కథ)
౼ఉండవిల్లి.ఎమ్

👆ఇద్దరు ముగ్గురు చదివే ఉండటాన, వేరే గ్రూపులో చదివిన కథ, ఇక్కడ ఉంచడం గురించి కొంత సందేహించాను. . కానీ చాలా మంది గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వారు కనుక, వారికి ఆహ్లాదం చేకూరుస్తుందని, పచ్చదనం పై అందరకూ మమకారం పెరగాలనీ,ఈ కధ ఉంచుతున్నాను. 🙏🙏

(హాస్పిటల్స్, కాలేజెస్ etc కూడా పార్కింగ్ లేకుండా వస్తుండటం చూస్తుంటే మన భాగ్యనగరం ఎటుబోతుందో అర్థం కాదు. అయితే ఎకరాలు వదిలేయడానికి వయబిలిటీ అడ్డుకదా అంటే నిజమే కదా అ?

13/04/2021

శ్రీప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు

29/03/2021

Wishing you a very happy holi to all

26/03/2019

we have completed villa project in hyderabad total project cost is 100 millions planning design and ex*****on.

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919391036419

Website

Alerts

Be the first to know and let us send you an email when MANI & MALLI ASSOCIATES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MANI & MALLI ASSOCIATES:

Share