09/06/2021
ధరలు అదుపు చేయలేకున్న ప్రభుత్వం
భీమవరం,09 జూన్ 2021
రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను తక్షణం తగ్గించాలని సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి. బలరాం డిమాండ్ చేసారు. స్థానిక మెంటేవారితోట పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా బలరాం మాట్లాడుతూ ఒక ప్రజలు కరోనాతో పోరాడుతుంటే, ప్రభుత్వాలు ప్రజలపై పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరల పేరుతో ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీటిని ఏమాత్రం మియంత్రించడం లేదన్నారు. కార్పొరేట్లు, బడా కంపెనీలు వారికి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహించారు. ఈరోజు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు రేపటికి అలానే ఉంటాయనే నమ్మకం లేదన్నారు. అలా పెరుగుతూ నేడు లీటర్ పెట్రోల్ రూ.102.05, డీజిల్ రూ.96.36 చేరుకున్నాయని అన్నారు. వీటిలో సగానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులే ఉన్నాయని అన్నారు. ఈ పన్నులను ప్రభుత్వాలు తగ్గించుకుంటే తక్కువ ధరలకే ప్రజలకు వీటిని ఇవ్వొచ్చన్నారు. ఒక వైపు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా, మన దేశంలో మాత్రం ధరలు విపరీతంగా పెరగడం దారుణమన్నారు. ప్రజలు ప్రశ్నించకపోతే ఈ ధరలు మరింత పెరిగే ప్రమాదముందన్నారు. పప్పులు, వంట నూనె, గ్యాస్, నిత్యావసరాల ధరలు నిత్యం ఆకాశాన్ని తాకుతూ ప్రజలపై మరింత భారాన్ని పెంచుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్ల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె ఎన్ వి గోపాలన్, నాయకులు అల్లూరి అరుణ్, ఎం. ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్, జి. రఫాయేలు పాల్గొన్నారు.