31/12/2023
#గర్భసంచిఅవసరం_పిల్లలుపుట్టేవరకేనా?
(A 2021 post)
రాత్రి ఎనిమిదిన్నరకు ట్రైన్. గౌతమి.
సాయంత్రం ఆరుకి "కడియం వెల్దామా పండూ, టైం సరిపోతుందా" అంటే, "మీ ఇష్టం మేమ్, వెల్దామంటే వెళ్దాం"
ఇక హడావిడిగా దారితీసాం. ఊర్లోకి ఎంటర్ అవ్వడమే నర్సరీలు స్వాగతం పలికాయి. రోడ్ దిగి వచ్చి మొక్కలు చూడసాగాను. నాకు కావలసినవి మధుమాలతి, సంపంగి ఎక్కడా కనబడలేదు. అయ్యో అనిపించి ఎవరినైనా అడుగుదామని అటూ ఇటూ చూస్తే, ఈ అమ్మాయి నావైపు నవ్వుతూ చూస్తూ ఉంది. ఒక క్షణం తికమకపడ్డా. అదేంటి నేను తెలిసినట్టు నవ్వుతోంది అని. నేనూ అయోమయంగా నవ్వా. "ఏం మొక్కలు కావాలి" అంది. "చక్కగా ఉన్నావు అమ్మాయ్, కానీ ఈ గులాబీలు, చేమంతులు మా అశోక్ నగర్లో కూడా ఉన్నాయి. నాకు మధుమాలతి కావాలి, బొండుమల్లె మొక్క కావాలి, ఉన్నాయా" అన్నా.
"అవేమీ లేవేమోనండీ, సంపంగి ఉన్నట్టుంది" అంటూ, ముందుకు దారి తీసింది. ఆ మొక్కల మధ్య అంతా తడిగా, బురదగా ఉంది. ఈ అమ్మాయి చెప్పులు వేసుకోలేదు. అదే అడిగా "చెప్పులేవీ కాళ్ళకి" అని, "ఏసుకోకూడదు" అంది. ".. అదేంటీ" అన్నా. "మాల వేసుకున్నా కదా" అంది. "ఇదేంటి, మాల వేసుకొంటే ఇంత చెమ్మలో పని చేస్తూ కూడా చెప్పులు వేసుకోకూడదా, ఆల్రెడీ ఆడవాళ్లు ఐనందుకు నెలవారీ సమస్యలు ఉండనే ఉంటాయి. పైన ఇవన్నీ కూడా అయితే ఎలా అమ్మాయ్" అన్నా. చక్కగా నవ్వుతూ చూస్తుంది నన్ను.. "నెలసరి సమస్యలేమీ లేవుకదా" అంది. ఒక్క క్షణం mind పని చేయలేదు. లోకంలో వయసులో ఉండి నెలసరి లేని స్త్రీలు ఉంటారా.. ఏం చెప్తుంది ఈ పిల్ల అనుకున్నా.
"సరిగ్గా చెప్పు, అర్ధం కాలే" అని.."కొంపదీసి గర్భసంచి తీసేసారా" అన్నాను. "ఔనండీ.. ఒకటే బ్లీడింగ్ ఐపోతుంటే, డాక్టర్లు తీసేసారు. తీసేసి మూడేళ్లు అయిపోయింది" అంది అలాగే నవ్వుతూ. "నీ వయసెంత" "ముప్పై" అంది. ముప్పై ఏళ్లకే నీకు ప్రతీ పనికీ అవసరమయ్యే హార్మోన్లను అందించే, నీ శరీర సమతౌల్యతను కాపాడే, నిన్ను ఆడపిల్లగా అందంగా ఆరోగ్యంగా ఉంచే ఈస్ట్రోజెన్ని స్రవించే వ్యవస్థ మొత్తాన్నీ తీయించేసుకున్నావా, చాలా తొందరపాటు పని చేశావ్" అన్నా. "డాక్టరే తీసేయాలి" అన్నారు మేడం, "ఇద్దరు పిల్లలు పుట్టేశారు, ఇంక ఉన్నా లేకున్నా ఒకటే అని, తీసేద్దాం అన్నారు" అంది. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
గర్భసంచి అంటే పిల్లలు పెరిగే సంచి అని, పిల్లలు పుట్టేస్తే ఇక దానితో పనిలేదనీ కొన్ని కార్పోరేట్ ఆస్పత్రుల డాక్టర్లు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ daily goals reach అవడానికి పట్టుమని పాతికేళ్లు కూడా లేని యువతుల గర్భసంచులు పీకిపారేస్తున్నారు. కనీసం యాభై ఏళ్ళ వరకూ ఉండి, స్త్రీకి ఒక నిరంతర security system లాగా పనిచేసే నెలసరిని అర్ధంతరంగా ఆపేస్తున్నారు. ఊళ్ళల్లో అమాయకులైన ఆడపిల్లలు చాలా ఎక్కువగా వీటికి బలౌతున్నారు. నెలసర్లు ఉంటే కూలిపనిలకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అని, కొన్ని రాష్ట్రాల్లో భూస్వాములు స్త్రీలకు బలవంతపు హిస్టరెక్టమీలు చేసి పారేస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని ముందు స్త్రీలు ఎదుర్కోవాలి. Over bleeding, irregular and painful periods కి ఆయుర్వేదంలో సైతం మంచి మందులు ఉన్నాయి. పరిష్కారం వెతకాలి.
ఒకే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి, వాళ్ళు అనవసర భయాలు కల్పిస్తే నమ్మి, మన పీరియడ్స్ సమస్య ఇంటిల్లిపాదికీ సమస్య అనుకుని అతిగా ఆలోచించి, గర్భసంచి తీసేస్తే అసలు periods ఉండవు కాబట్టి, ఇంట్లో వారికి కూడా ఇబ్బంది ఉండదు అన్నట్టు self blaming చేసుకొంటూ, ఒక guilt feel ని మోస్తూ ఈ సర్జరీలు చాలా మామూలుగా చేయించేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. స్త్రీకి uterus శరీరంలో భాగం. ఆ వ్యవస్థ ఆమెను స్త్రీగా, స్త్రీత్వంతో ఉంచుతుంది. Bodily equilibrium ని, skin and bone health ని కాపాడుతూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవన్నీ కార్పోరేట్ ఆస్పత్రులలో చెప్పరు కనుక స్త్రీలు mislead అయ్యి, ఈ సర్జరీలు చేయించేసుకుంటున్నారు. ఇది చాలా దారుణం.
కాబట్టి వీలైతే educate చేయండి. ఈనాడు సుఖీభవ లాంటి ప్రోగ్రాంలు స్త్రీల ఆరోగ్య విషయాల్లో చాలా informative గా ఉంటున్నాయి. వాటిని regular గా ఫాలో అయ్యేలా చూడండి. స్త్రీ తన శరీరం గురించి పూర్తి అవగాహనతో ఉంటేనే, సరైన జాగ్రత్తలు తీసుకోగలుగుతుంది. మీ కూతుళ్లకు, భార్యలకు అలాంటి సపోర్ట్ మీరూ ఇవ్వాలి.
ఆ అమ్మాయికి కూడా ఇవే విషయాలు చెప్పి, కొన్ని మొక్కలు కొని, సెలవు తీసుకున్నా. వీలైతే పల్లెటూళ్లలో ప్రభుత్వ డాక్టర్ల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేయాలనుంది.
#అరుణ