13/07/2026
*ఈ వార్త వెనుక బీజేపీ ఉందా? లేక వైస్సార్సీపీ ఉందా తెలియదు*
ఆ శుభ ముహూర్తం జూలై 18తేదని సమాచారం
నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సన్నాహాలు మొదలైనాయి
విజయ్ నమూనాలో మొదట సామాజిక సేవా కార్యక్రమాల ప్రారంభం
ఏడాదిపాటు అభిమాన సంఘాలను వ్యవస్థీకృతం చేయడం
ఆ తర్వాత రాజకీయ పార్టీ పేరు, జెండా ప్రకటన
ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ జన ప్రభంజనం సృష్టించడం ఖాయం
రాష్ట్ర రాజకీయాలలో భూకంపం రాబోతున్నది. ఇటు ప్రభుత్వ పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పెను ప్రకంపన తటస్థించబోతున్నది. రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసే ప్రళయం సిద్ధించబోతున్నది. సినీ వినీలాకాశంలో సమున్నతమైన స్థానం సాధించిన జూనియర్ ఎన్టీఆర్, తెర మీద నుంచి తెర ముందుకు రాబోతున్నాడు. జనంతో మమేకం కాబోతున్నాడు. గత నాలుగైదు నెలలుగా చర్చలో వున్న ఈ అంశానికి తుది రూపం సిద్ధించిందని విశ్వసనీయ సమాచారం.
రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించే అర్హతలు అన్నీ జూనియర్ ఎన్టీఆర్‌కు వున్నాయి. ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు కూడా ఆయనే. బాలకృష్ణకు కుమారుడున్నా వయస్సు రీత్యా చిన్నవాడు; తతిమా ఎన్టీఆర్ కుమారులెవరికీ ఆ ఆసక్తి లేదు. హరికృష్ణ కుమారుడిగా, ఎన్టీఆర్‌కు సిసలైన వారసత్వం జూనియర్ ఎన్టీఆర్‌కు సహజంగానే లభిస్తున్నది. దానికి తగినట్లు, తాత గుణాలలో చాలా సంక్రమించాయి ఆయనకు. గంభీరమైన పదాలతో ఉపన్యాసాలు చేయడం, ప్రజలను ఆకట్టుకునే వేష భాషలు ప్రదర్శించడం, ఎన్టీఆర్ వలె చైతన్య రథ యాత్రలు చేయడం వంటి లక్షణాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజలలో వున్న సమ్మోహనా శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతరంలో చాలా మోజు వుంది. కొత్తగా రాజకీయ ప్రవేశం చేసి, త్వరితంగా ప్రజల దృష్టిలో పడడానికి కావలసిన అర్హతలన్నీ వున్నట్లే లెక్క. పైగా, రాజకీయం ఇదే ప్రథమం కాబట్టి, ఆరోపణలు, విమర్శలు, వేలెత్తి చూపడాలు లేవు. కుటుంబ పరంగా కూడా ఉన్నత విలువలు పాటించే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్‌కు పేరుంది. సంస్కారం ఆయన స్వభావంలో వ్యక్తమవుతూ వుంటుంది.
రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఆయనలో ఎంతో కాలంగా బలంగా ఉన్న మాట నిజం. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కూడా చేశాడు. అయితే ఆ ప్రయత్నం పెద్దగా సఫలం కాలేదు. దానితో రాజకీయం విరమించుకొని, పూర్తిగా సినిమాలకు అంకితమై పోయాడు. 2009లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తనను తాను నాయకుడిగా ప్రజలకు పరిచయం చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీ ప్రచార సారథిగా మాత్రమే వ్యవహరించాడు. అందువల్ల ఆ ఎన్నికలు ఆయన ప్రజాదరణ అంచనా వేయడానికి లెక్కలోకి రావు. అప్పటి నుంచి ఆయన వ్యూహాత్మక మౌనం పాటించాడు. ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేనట్లు వ్యవహరించాడు. ఎన్టీఆర్ కుటుంబ వివాదంగా మారిన కొడాలి నాని దూషణల సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మౌనం వహించడం అప్పట్లో కొంత చర్చకు కూడా దారి తీసింది.
ఈ నేపథ్యంలో, తమిళనాడు ఎన్నికలలో సినిమా నటుడు విజయ్ వున్నట్లుండి ముఖ్యమంత్రి పీఠం అధివసించడం జూనియర్ ఎన్టీఆర్‌లో ఆలోచన కలిగించింది. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే దీనిపై తన అంతరంగికులతో, బంధువులతో మాట కలిపాడాయన. బిజెపితో కలిసి వెళ్లి వుంటే విజయ్ మరిన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకునే వాడన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు అప్పుడు.
విజయ్ నమూనాలో తను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న స్థిర నిర్ణయానికి రావడం జరిగి పోయింది. ఈ విషయం గ్రహించిన బిజెపి అగ్రనేతలు, మరీ ముఖ్యంగా హోమ్ మంత్రి అమిత్‌షా జూనియర్ ఎన్టీఆర్‌తో చుట్టరికం కలుపుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య ఒకటి రెండు సమావేశాలు కూడా జరిగినట్లు తెలుస్తున్నది. ఏట్లయినా జూనియర్ ఎన్టీఆర్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవాలన్నది అమిత్‌షా ఆలోచన.
అయితే, అమిత్‌షా ఆలోచనకు గుడ్డిగా తలవూపే స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ లేడన్నది సమాచారం. ఇతర రాజకీయ వాదుల వలె బిజెపి ప్రయోగించే సిబిఐ, ఈడి, ఇన్‌కంటాక్స్ అస్త్రాల భయం ఆయనకు లేదు. ఎటువంటి కుంభకోణాలు, తప్పుడు పనులలో ఆయనకు భాగం లేదు. అటువంటి ఆలోచనలు కూడా లేవు. ఇప్పటివరకు స్వచ్ఛంగా జీవితం గడిపిన వాడు. అందువల్ల అమిత్‌షాను చూసి భయపడి నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేదు. పెద్దన్నగా సలహా సంప్రదింపులకు పరిమితం కావచ్చు.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గరి సంబంధాలున్నాయి. గతంలో ఆయన qచేసిన రాజకీయ ప్రయత్నాలకు, ప్రసంగాలకు మార్గదర్శి రేవంత్‌రెడ్డి కావడం గమనార్హం. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఉన్నత స్థితిలో వున్నాడు. ఆయన ఇచ్చే సలహాలకు ఎంతో విలువ వుంటుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గరి స్నేహితుడే. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం వుంది. అందువల్ల విజయ్ హావభావాలను అడిగి తెలుసుకొనే అవకాశం వుంది. ఒక రకంగా చెప్పాలంటే, విజయ్ నమూనాలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని డిజైన్ చేసుకొంటున్నట్లు కన్పిస్తున్నది. రేపు 18తేది ఆయన సామాజిక సేవా పథకం ప్రకటించబోతున్నాడు. ప్రజలకు అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాడు. వాటిలో తన అభిమానులను భాగస్వాములను చేయాలన్నది ప్రణాళిక. ఒక సంవత్సరం పాటు, రాజకీయాల గురించి మాట్లాడకుండా, కేవలం సేవా కార్యక్రమాల అమలు మీద దృష్టిపెట్టి, ప్రజలలో వాటికి గుర్తింపు, గౌరవం తెచ్చేట్లుగా తీర్చిదిద్ది, అభిమానులను ప్రజా సేవకులుగా మలచుకొని, ఆ తర్వాత రాజకీయ ప్రణాళిక అమలు చేయాలన్నది ఆలోచన అట. అందుకు శుభ ముహూర్తం - జూలై 18తేది.
ఈ వార్త, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇటు ప్రభుత్వం నడుపుతున్న తెలుగుదేశం పార్టీ, అటు ప్రతిపక్షంలో వున్న వైకాపాలు రెండూ ఉలిక్కి పడుతున్నాయి. ఈ రెండు పార్టీల మీద ప్రజలలో అభిమానం, నమ్మకం సడలి పోయాయన్న అంచనాల నేపథ్యంలో, రాష్ట్రంలో ఏర్పడిన ఒక రాజకీయ శూన్యస్థితిని పూరించడానికి జూనియర్ ఎన్టీఆర్ అన్నివిధాల తగిన వాడన్నది పరిశీలకుల అంచనా.
రెండు పార్టీలలో ఈ పరిణామం ఎటువంటి ప్రభావం కల్గించ బోతున్నదన్నది ప్రశ్న. నిజం చెప్పాలంటే, రెండు పార్టీల నుంచి ఎంతో మంది నేతలు, చాలామంది సీనియర్ నేతలు కూడా ఒక ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నారు. తమ పార్టీ భవిష్యత్తు మీద రెండు పార్టీలలో నమ్మకం లేదు. చంద్రబాబు నుంచి లోకేష్‌కు అధికార బదలీ ప్రక్రియ తెలుగుదేశం వాదులకు అసంతృప్తి కలిగిస్తున్నది. లోకేష్ తరహా రాజకీయం తమకు సరిపడడం లేదని చాలామంది మంత్రులు కూడా బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ సంగతి చెప్పనవసరం లేదు. జగన్ మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ప్రకటన పార్టీకి నష్టం చేస్తున్నాయే తప్ప భవిష్యత్తును నిర్దేశించేవిగా లేవని సర్వజనాభిప్రాయం. ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రూపు దిద్దుకోగలిగితే, రెండు పార్టీలను వదలి పొలోమని ఆయన వెంట నడవడానికి సిద్ధంగా వున్నారు నేతలు. ప్రజలలో కూడా అటువంటి అభిప్రాయాలే వున్నాయి. రెండు పార్టీలూ తమను మోసం చేశాయన్న అసంతృప్తితో వున్నారు ప్రజలు. మూడో నాయకుడు దొరికితే, ఒక ప్రయత్నం చేసి చూడడానికి ఏ మాత్రం వెనుకాడరు.
మొత్తం మీద జూలై 18తేది జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన కేవలం సామాజిక సేవా కార్యక్రమాలకు పరిమితంగా వుండబోతున్నప్పటికీ, అసలు వుద్దేశ్యం మాత్రం రాజకీయ ఆరంగేట్రమని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు తథ్యం..