01/11/2025
నలభై లో జీవితం
ఇప్పటివరకూ ఏ మానసిక రోగం రాకపోతే ఇక దాదాపు రావు.
ఇప్పటి వరకూ ఏ వ్యసనం అబ్బకపోతే ఇక దాదాపు అబ్బవు.
ఇప్పటి వరకూ పెళ్లి కాకపోతే ఇక, ఇది చెప్పను.
ఇప్పటి వరకూ భయపడిన తెల్ల వెంట్రుకలను స్వాగతిస్తారు .
షుగరు, బీపీలు రాడానికి ఇంకా సమయం ఉంది. కొంతమందికి ఆల్రెడీ వచ్చేసి ఉంటాయనుకో
ఈపాటికి మీ భర్తకో, భార్యకో ఏది నచ్చుద్దో, ఏది నచ్చదో బాగా అవగాహన వచ్చేస్తుంది. ఈలోపు విడాకులు కాకపోతే ఇక కాటివరకూ వాళ్ళతోనే.
పిల్లలు వాళ్ల సంచులు వాళ్ళు సర్దుకుని బడికి, కాలేజీకి పోతుంటారు, నీకు ఫీజు కట్టడం తప్ప పెద్ద పనిలేదు.
మీ అమ్మానాన్నలు ఉంటే ప్రతిరోజూ పలకరించవచ్చు, లేదంటే ఏడాదికి ఒకసారి తద్దినం చెయ్యవచ్చు.
ఈపాటికి ఏదో ఇల్లో పొల్లో, అప్పులోనో, ఆస్తిగానో ఉంటుంది. దానికి ఇక వాయిదాలు అలవాటవుతాయి, భారం అనిపించదు
అసూయ, ఈర్ష్య మొదలైనవన్నీ ముసుగేసి పడుకుంటాయి. అలాగే ఉత్తేజం, ఉత్సుకత కూడా. మహా అయితే చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్న చిన్న సంగీతమో, సంకలనమో నేర్చుకుంటావు.
ఇప్పటివరకూ జీవితంలో చేస్తున్నదానిపట్ల ఒక అవగాహన వచ్చి, అది నచ్చినా నచ్చకపోయినా అదొక బలం అని విశ్వసించి ఇక వచ్చే పదేళ్లు దానిని సానపెట్టడం కర్తవ్యంగా పెట్టుకుంటావు.
ఈలోగా నీతోటివాళ్లకి పాపం ఆరోగ్యం బాగాలేకో, వ్యాపారంలో నష్టం వచ్చో, సంసారంలో చిక్కులు వచ్చో ఇలా ఏదో ఒకటి జరిగి, హమ్మయ్య భగవంతుడు నాకు ఆ కష్టాన్ని ఇవ్వలేదు అని కృతజ్ఞత చూపిస్తావు.
ఎవరికి ఓటెయ్యాలి, ఏ రాజకీయ నాయకుడు ఎలాంటివాడు, ఏ చుట్టం ఎలాంటివాడు, ఎవడు ఆప్తుడు, ఎవడు స్నేహితుడు, ఎవడు శత్రువు అన్న స్పష్టత తన్నుకుని వచ్చేస్తుంది.
నీకంటే వెనక పుట్టినవాళ్ళు నీకంటే ఎక్కువ సతమతం అవడం చూసి ఊపిరి పీల్చుకుంటావు.
నీ తోబుట్టువులు వాళ్ల బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఇంకా ప్రతీసారి నీ సాయం వాళ్ళు పొందుతుంటే వాళ్ళకి ఇక బాగుపడే లక్షణం లేదని లేదా నీకు లోకజ్ఞానం తెలీదని.
అప్పులివ్వడానికి నీ దగ్గర డబ్బులుండవు. తీసుకోడానికి తీరుస్తామన్న ధైర్యం ఉండదు.
ఇకనుంచీ నీవంటూ ఏ గమ్యాలు ఉండవు. అవి నీ భాగస్వామితోనో లేక నీ కుటుంబంతోనో ఉంటాయి. విజయం అయినా, వైఫల్యం అయినా సమిష్టి బాధ్యత అది.
డాక్టర్లకి ఇవ్వడానికి నెలకి ఇంత అని కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లులా పెట్టుకోవాలి. అది ఖర్చు అనుకోకూడదు అని మనసుకి అలవాటు పడుతుంది.
Sri Satyanarayana Traders GULLAKOTA