21/07/2016
పురాణాల్లో రాజును ఏ దేవునితో పోల్చేవారు?
+ ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమైంది.
+ భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులని ఇండో ఆర్యులని, వారు ఇక్కడ సంచరించిన భూభాగాన్ని ఆర్యావర్తమని అంటారు.
+ఈ కాలంలో అభివృద్ధి చెందిన నాగరికతను వైదిక నాగరికతగా పరిగణిస్తున్నారు. క్రీ.పూ. 1500-600 మధ్య కాలాన్ని వేద/వైదిక కాలంగా పేర్కొంటారు. దీనిని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు.
+ తొలి వైదిక కాలం(క్రీపూ1500- 1000): ఈ కాలం రుగ్వేదం ద్వారా తెలిసింది. కాబట్టి ఈ కాల సంస్కృతిని తొలి వైదిక సంస్కృతి అంటారు.
+మలి వైదిక కాలం(క్రీపూ1000-600): మిగిలిన మూడు వేదాల ద్వారా తెలిసిన సంస్కృతి కాబట్టి దీనిని మలి వైదిక సంస్కృతి అంటారు.
+ ‘ఆర్యులు’ పదం, ‘ఆర్య’ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఆర్య అంటే గొప్పవారని అర్థం.
+ ఆర్యులు మధ్య ఆసియాలోని దక్షిణ రష్యా గడ్డి మైదానాల్లో నివసిస్తూ అక్కడ నుంచి ఉత్తర, పశ్చిమ భారతదేశానికి వలసవచ్చి ఇండో ఆర్యన్లుగా స్థిరపడ్డారు.
ఆర్యుల జన్మ స్థానానికి సంబంధించిన సిద్ధాంతాలు
ఆర్యుల ప్రతిపాదించినవారు
జన్మస్థానం
ఆర్కిటిక్ ప్రాంతం బాలగంగాధర తిలక్
ఉత్తర మైదాన ప్రాంతాలు లియొనార్డ్ పూలీ
మధ్య ఆసియా మాక్స్ ముల్లర్
టిబెట్ ప్రాంతం దయానంద సరస్వతి
హిమాలయ లక్ష్మీధర్ శాసి్త్ర
పాద ప్రాంతాలు
సైబీరియా ప్రాంతం జె.డి.మోర్గాన
ఆసి్ట్రయా - హంగేరీ డా. గైల్
సప్త సింధు ప్రాంతం డా.ఎ.సి దాస్
వైదిక సాహిత్యం
+ ఆర్యుల సమాచారం వైదిక వాఙ్మయం నుంచి తెలుస్తుంది.
+ వైదిక సాహిత్యం ప్రధానంగా రెండు రకాలు
1. శృతి సాహిత్యం 2. స్మృతి సాహిత్యం
శృతి సాహిత్యం
+ శ్రుతి అంటే విన్నవి లేదా తెలియజెప్పినవి అని అర్థం. సృష్టిలో అనంతం నుంచి కొంతమంది రుషులు విన్న ఛందోబద్ధమైన, అర్థవంతమైన శబ్దాలే ఈ శృతి సాహిత్యమని చెప్పవచ్చు. రుషుల నోటి నుంచి ఒకరి ద్వారా మరొకరికి చేరుతూ వచ్చిన పవిత్ర జ్ఞాన సంపదగా ఇవి ప్రఖ్యాతి పొందాయి.
ఫ వేదాలను దైవానుగ్రహంతోనే రుషులు వినడంతో వాటిని ‘శ్రుతులు’ అని కూడా అంటారు.
వేదాలు
+ సంస్కృత ధాతువైన ‘విద్’ నుంచి ‘వేద’ అనే పదం పుట్టింది. వేదమంటే జ్ఞానమని అర్థం. వేదాలను అపౌరుషేయాలు (రచించినవి)గా పరిగణిస్తారు. ప్రతి వేదం నాలుగు భాగాలుగా ఉంటుంది.
1. సంహిత 2. బ్రాహ్మణాలు 3. అరణ్యకాలు
4. ఉపనిషత్తులు
+ వ్యాసుడు సంకలనం చేసిన రుగ్వేదాన్ని పైల మహర్షికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అధర్వణ వేదాన్ని సుమంతునికి నేర్పించారు.
సంహితలు
+ సంహిత అంటే మంత్రాల సంకలనం. వివిధ దేవతలను ప్రార్థిస్తూ పాడిన శ్లోకాల సంకలనాలనే సంహితలు అంటారు.
రుగ్వేద సంహిత
+ దీనిని పైల మహర్షి సంకలనం చేశారు. రుగ్వేద సంహితలోని మంత్రాలను ‘రుక్కులు’ అంటారు. ఇవన్నీ దేవతలను ప్రార్థించే మంత్రాలే. వీటిని ఉచ్ఛరించే బ్రాహ్మణుని ‘హోత్రి’ అంటారు. ఇది అన్నింటికంటే ప్రాచీనమైనది.
+ రుగ్వేదంలోని పది మండలాల్లో మొత్తం 1028 సూక్తాలు ఉన్నాయి. రెండు నుంచి ఏడు మండలాలు పూర్వ కాలానికి చెందినవి. వీటిని కుటుంబ పుస్తకాలు లేదా వంశ మండలాలు అంటారు. ఇందులో రుషుల కుటుంబాల వివరణ ఉంది. 1, 8, 9, 10 మండలాలు ఉత్తర కాలానికి చెందినవి.
+ మూడో మండలంలో గాయత్రీ మంత్రం, ఏడో మండలంలో దశరాజ్య యుద్ధం, తొమ్మిదో మండలంలో సోమ పానీయం, పదో మండలంలో సమాజంలోని నాలుగు వర్గాల విభజన గురించి ఉంది.
+ భారతదేశానికి ‘భరతవర్షం’ అనే పేరు ‘భరత తెగ’ వలన వచ్చినట్లు రుగ్వేదంలో ప్రస్తావించారు.
+ రుగ్వేదంలో ప్రస్తావించిన పదాలు
ఓం - 1028 సార్లు; జన - 275 సార్లు
విస్ - 171 సార్లు; బ్రాహ్మణ - 14 సార్లు
క్షత్రియ - 9 సార్లు; శూద్ర - ఒకసారి
సభ - 8 సార్లు; సమితి - 9 సార్లు
సామవేద సంహిత: దీనిలో రుగ్వేదం నుంచి గ్రహించిన స్తోత్రాలు ఉన్నాయి. ఈ వేదాన్ని ప్రార్థనా గీతాల గ్రంథంగా పేర్కొంటారు.
+ ఇది భారతీయ సంగీతానికి మూలాధారం. సోమకర్మ ఆచరించేటప్పుడు పాడుకోవడానికి వీటిని రూపొందించారు.
+ సామవేదాన్ని ఉచ్ఛరించే బ్రాహ్మణులను ‘ఉద్గాత్రి’ అంటారు.
+ దీనిని జైమిని సంకలనం చేశారు.
యజుర్వేద సంహిత: దీనిని వైశంపాయనుడు సంకలనం చేశారు. యజ్ఞాలు ఏ విధంగా చేయాలో ఈ వేదంలోని మంత్రాలు తెలియజేస్తాయి. ఈ మంత్రాలను పఠించే వారిని ‘అధర్వ’ అంటారు. దీనిని క్రతు సూత్రాల వేదం అంటారు. యజుర్వేద సంహితను రెండు భాగాలుగా విభజించారు
1. కృష్ణ (నల్లని) యజుర్వేదం
2. శుక్ల(తెలుపు) యజుర్వేదం
+ యజుర్వేదంలో ‘యజస్సులు’ అనే మంత్రాలు ఉంటాయి.
అధర్వణ సంహిత: దీనిని సుమంతుడు సంకలనం చేశారు. ఆర్యేతరుల గ్రంథంగా భావిస్తారు. ఇందులో ఎక్కువగా కింది తరగతులకు సంబంధించిన జనజీవితం కనిపిస్తుంది.
+ ఈ వేదంలో రోగాలను, దుష్టశక్తులను పారద్రోలే అంశాలు అంటే మంత్ర తంత్రాలు ఉంటాయి. ప్రాచీన వైద్యశాసా్త్రనికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇందులో ఆయుర్వేదం గురించి ప్రస్తావించారు. దీనిని బ్రహ్మ వేదం అని కూడా అంటారు.
రుగ్వేద సంహిత - దేవతల గుణగణాలను స్తుతించడం
సామవేద సంహిత - దేవతలను ఆరాధిస్తూ గానంచేయడం
యజుర్వేద సంహిత - యజ్ఞయాగాల వివరణ
అధర్వణ సంహిత - వైద్యం, మాంత్రిక విద్య
బ్రాహ్మణాలు
+ వేద మంత్రాలకు, ప్రార్థనలకు సంబంధించి వివరణా త్మకంగా పేర్కొనే వాటినే బ్రాహ్మణాలు అంటారు.
+ ప్రతి సంహితకు కొన్ని బ్రాహ్మణాలు అనుబంధమై ఉంటాయి. ఇవి మంత్రాల అర్థాన్ని, ఉపయోగాన్ని వివరిస్తాయి.
+ వివిధ యజ్ఞాల్లో వాటికి సంబంధించిన మంత్రాల అర్థాలను వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ యాగాన్ని ఎలా నడపాలో విశదపరుస్తాయి. వేదాలకు ఉపాంగాలుగా ఉంటాయి.
రుగ్వేద బ్రాహ్మణాలు
+ ఐతరేయ బ్రాహ్మణం
+ కేశీతకి బ్రాహ్మణం (శాంఖాయాన బ్రాహ్మణం)
యజుర్వేద బ్రాహ్మణాలు
+ తైత్తిరీయ బ్రాహ్మణం: ఇది రుగ్వేద బ్రాహ్మణాల కంటే కూడా పురాతనమైంది.
+ శతపథ బ్రాహ్మణం: శుక్ల యజుర్వేదంలో ప్రసిద్ధమైనది. ఇందులో వడ్డీ వ్యాపారం, ఉపనయనం, మృత్యువు, మహాప్రళయం వంటి అంశాలను ప్రస్తావించారు.
సామవేద బ్రాహ్మణాలు
+ తాండ్య బ్రాహ్మణం
+ జైమినీయ బ్రాహ్మణం
+ అధర్వణవేద బ్రాహ్మణాలు
+ గోపథ బ్రాహ్మణం
అరణ్యకాలు
+ వనాలలో మునులు, పండితుల మధ్య జరిగే చర్చలుగా వీటిని భావిస్తారు. ఇవి బ్రాహ్మణాలతోపాటు వేదాలకు అనుబంధంగా ఉంటాయి.
+ వనవాసంలో చేయదగిన తపోధ్యానాది కర్మలకు సంబంధించిన విధులను నిర్దేశించేవి అరణ్యకాలు.
+ ఇవి మార్మిక, యాగ ప్రతీక వాదాలతోపాటు పౌరోహిత్య తత్వాన్ని కూడా వివరిస్తాయి. ఈ సాహిత్యం చాలావరకు అందుబాటులో లేదు.
అనుబంధ అరణ్యకాలు
రుగ్వేద సంహిత - ఐతరేయ, కౌషితకి
యజుర్వేద సంహిత - తైత్తిరీయారణ్యకం, బృహదారణ్యకం
సామవేద సంహిత - తలవకార అరణ్యకం
ఉపనిషత్తులు
+ గురువు దగ్గర కూర్చొని విద్యార్థులు జ్ఞానాన్ని అభ్యసించడాన్ని ఉపనిషత్తు అంటారు. ఇవి వేదాంత పరమైన ప్రశ్నలకి సమాధానాలను అందిస్తాయి.
+ భగవంతుని పుట్టుక గురించి, మానవ విశ్వాసానికి గల సంబంధాన్ని వివరిస్తాయి. అందుకే ఉపనిషత్తుల సారాంశాన్ని ‘వేదాంతం’ అంటారు.
+ మొత్తం ఉపనిషత్తులు 108. వీటిలో ముఖ్యమైనవి 12. ఇవి వేదాలకు అనుబంధంగా ఉంటాయి.
రుగ్వేద ఉపనిషత్తులు
+ ఐతరేయ ఉపనిషత్తు ఫ కౌషితకి ఉపనిషత్తు
సామవేద ఉపనిషత్తులు
+ చాందోగ్య ఉపనిషత
+ కేనోన ఉపనిషత
యజుర్వేద ఉపనిషత్తులు
+బృహదారణ్యక ఉపనిషత
+తైత్తిరీయ ఉపనిషత
+ కఠోపనిషత
+ శ్వేతాశ్వేతరోపనిషత
+ ఈశావాస్యోపనిషత
అధర్వణ వేద ఉపనిషత్తులు
+ ముండకోపనిషత
+ ప్రశ్నోపనిషత
+ మండూక్యోపనిషత
+ముండకోపనిషత నుంచి ‘సత్యమేవ జయతే’ని, బృహదారణ్యకోపనిషత నుంచి ‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయా’ శ్లోకాన్ని గ్రహించారు.
+ ఆశ్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం ‘జబాల ఉపనిషత’లో ఉంది.
స్మృతి సాహిత్యం
+‘స్మృతి’ అంటే జ్ఞాపకముంచుకున్నది’ అని అర్థం. ప్రాచీన కాలంలో రుషులు వైదిక జ్ఞానాన్ని తరవాతి తరాల వారికి మౌఖికంగా అందించేవారు. తమకు జ్ఞాపకం ఉన్న వాటిని తరవాతి తరాలకు అందించిన వాఙ్మయం కాబట్టి దీనిని స్మృతి వాఙ్మయం అంటారు.
+ స్మృతి సాహిత్యంలో వేదాంగాలు, ఉపవేదాలు, పురా ణాలు, ఇతిహాసాలు ఉంటాయి.
ఉపవేదాలు
+ వేదాలపై వ్యాఖ్యలను ఉపవేదాలు అంటారు.
గాంధర్వ వేదం - సామవేదం - గానం
ధనుర్వేదం - రుగ్వేదం - యుద్ధం
శిల్పవేదం - యజుర్వేదం - కళలు
ఆయుర్వేదం - అధర్వణ వేదం - వైద్యం
వేదాంగాలు
+ స్మృతి వాఙ్మయంలో ముఖ్యమైనవి. వేదాల సరైన ఉచ్ఛారణ, ఉపయోగం, అవగాహనలకు తోడ్పడే అనుషంగిక గ్రంథాలను వేదాంగాలు అంటారు. మొత్తం వేదాంగాలు ఆరు. వేదాంగాలు మానవ సృష్టితాలు. సూత్రాల రూపంలో ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకోవ డానికి వీలుగా క్లుప్తీకరించిన వచన పద్యాలు. వేదాలను సరిగా అధ్యయనం చేసేందుకు, అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి.
శిక్ష: వేద మంత్రాల స్వర, వర్ణ, మాత్రాదుల ఉచ్ఛారణ విధాన పరిరక్షణకు ఉద్దేశించిన శాస్త్రం. వేద సంహితల లోని వివిధ శాఖలకు సంబంధించిన ఉచ్ఛారణ విధానాన్ని ఈ గ్రంథాలు బోధిస్తాయి.
కల్ప: కల్ప శాసా్త్రన్ని అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు రచించారు. ఒక విస్తృతమైన విషయాన్ని క్లుప్తంగా కొద్ది మాటలతో నిక్షిప్తం చేసి ఉంచే ప్రక్రియ సూత్ర రచన. ఆరు వేదాంగాల్లో ఇది ప్రధానమైనది. ఈ వేదాంగంలో యజ్ఞయాగాదులను ఏ విధంగా నిర్వర్తించాలో వివరిం చారు. గృహస్తు విధులు, సామాజిక బాధ్యతలను గురించి వివరిస్తుంది.
వ్యాకరణ: వ్యాకరణ శాసా్త్రనికి సంబంధించి కనిపించే గ్రంథం పాణిని ‘అష్టాధ్యాయి’. ఇందులో వ్యాకరణ సూత్రాలు ఉంటాయి.
నిరుక్త: వేద శబ్దాల వ్యుత్పత్తి అర్థాలను వివరిస్తుంది. నిరుక్త శాసా్త్రన్ని యాన్కుడు రచించాడు.
చంధస్సు: వేదాల్లో రుషులు ఉపయోగించిన వివిధ చంధస్సుల లక్షణాలను, లౌకిక కావ్యాల్లోని ఛందో లక్షణాలను ఈ సూత్రాలు తెలియజేస్తాయి.
పురాణాలు
+ పురాణం అంటే పాతది లేదా ప్రాచీనమైనదని అర్థం. పురాణాల్లో రాజును విష్ణువుతో పోల్చారు.
ఫ మహా పురాణాలు 18 అవి...
1. విష్ణు 2. నారద 3. భాగవత 4. గరుడ 5. పద్మ 6. వరాహ 7. మత్స్య 8. కూర్మ 9. లింగ 10. శివ 11. స్కాంద 12. అగ్ని 13. బ్రహ్మాండ 14. బ్రహ్మ వైవర్త 15. మార్కండేయ 16. భవిష్య 17. వామన 18. బ్రహ్మ
+ పురాణాలు మొదటగా నాలుగు యుగాల గురించి పేర్కొన్నాయి.
కృతయుగం-4800 ఏళ్లు
త్రేతాయుగం - 3600 ఏళ్లు
ద్వాపరయుగం - 2400 ఏళ్లు కలియుగం - 1200 ఏళ్లు
ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం.
వెయ్యి మహా యుగాలు కలిస్తే ఒక కల్పం.
ప్రతి కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి.
ప్రతి మన్వంతరానికి ఒక మనువు ఉంటాడు.
ఒక యుగం తరవాత మరో యుగం వస్తుంది. దాని కాలవ్యవధి వినాశనం తరవాత పునఃసృష్టి జరుగుతుంది.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. రుగ్వేదాన్ని విభజించిన భాగాలు? (జెఎల్)
1) పురాణాలు 2) ఉపనిషత్తులు
3) మండలాలు 4) అక్షయికాలు
2. పురాణాల్లో రాజును ఏ దేవునితో పోల్చేవారు? (గ్రూప్ 1)
1) రాముడు 2) విష్ణువు 3) బ్రహ్మ 4) శివుడు
3. ప్రథమంలో మహాభారతం పేరు? (గ్రూప్ 1)
1) హరివంశం 2) అపస్తంభా సూత్రం
3) జయసంహిత 4) అష్టాధ్యాయి
4. ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా
పరిగణిస్తారు? (గ్రూప్ 2)
1) రుగ్వేదం 2) యజుర్వేదం
3) సామవేదం 4) అథర్వణ వేదం
5. మొత్తం పురాణాల సంఖ్య? (గ్రూప్ 2)
1) 18 2) 20 3) 12 4) 16
సమాధానాలు
1) 3 2) 2 3) 3 4) 3 5) 1