04/02/2023
నిరుద్యోగం ఎందుకింతగా పెరుగుతోందో తెలుసా ..? యువతలో తగినన్ని కొత్త నైపుణ్యాలు లేకనే ..! ఇదీ ‘ఈనాడు’ వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉండే సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో ఇప్పుడు ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నా.. ఈనాడు మళ్ళీ అదే పాత పాట పాడుతోంది ! కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలని వీధిన పడ్డ ఉద్యోగులకు మొదటి పేజీలో హితభోధ చేస్తోంది. రాబోయే రోజుల్లో వీధుల్లోకి వచ్చే ఉద్యోగులను మభ్యపెడుతోంది.
ఆర్ధిక అనిశ్చిత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు, లాభాలు కాపాడుకునేందుకే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపాల్సి వచ్చిందని ఐటి కంపెనీలే స్పష్టం చేశాయి. తగిన కొత్త నైపుణ్యాలు లేనందునే ఉద్యోగులను తీసేశామని ఏ కంపెనీ కూడా చెప్పలేదు. వాస్తవానికి ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళలో ఎక్కువమంది అనుభవం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులే. అంత నైపుణ్యాన్ని భరించి, అంత జీతాలు ఇచ్చి, లాభాల్లో కోత పెట్టుకోలేమనే కంపెనీలు చెబుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఉద్యోగాల కోతలో HR విభాగంలోని ఉద్యోగులపైనే భారీగా వేటు పడింది. అంటే .. కొత్త ఉద్యోగులను తీసుకునే పని పెద్దగా ఉండబోదని, ఒకవేళ తక్కువ వేతనాలతో కొత్త ఉద్యోగులను తీసుకోవాల్సి వచ్చినా ఆటోమేషన్ సాయంతో పనిని చక్కబెట్టే అవకాశం ఉందనీ కంపెనీలు భావించడమే ఇందుకు కారణం.
వాస్తవాలు ఇలా ఉంటే .. నైపుణ్యాలపై నెపం నెట్టి ‘ఈనాడు’ యువతను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నట్లు ? ఇదీ అసలు ప్రశ్న. బి టెక్ పట్టాలు చేతపట్టి నిరుద్యోగంతో సతమతమౌతోన్న యువత ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్న పరిస్థితిని చూసి ఏమైపోవాలి ? కొత్తగా ఎన్నో కలలతో ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిన విద్యార్ధులు ఐటి పరిస్థితిని చూసి ఈ వ్యవస్థ గురించి ఏమనుకోవాలి ? అమ్మో పెద్ద ప్రమాదం ! సమాజంలో అంతా బాగానే ఉందని యువత అనుకోవాలి. అమెరికా కలలను సజీవంగా కాపాడుకోవాలి. అందుకే.. నైపుణ్యాలు లేకపోవడం వల్లే నిరుద్యోగమని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే ప్రస్తుత ఉద్యోగార్ధులకు ప్రమాదం లేదని నమ్మబలకాలి.
పెట్టుబడిదారీ విధానంలో లాభం మాత్రమే ప్రధానం. పోగుబడిన లక్షల కోట్ల రూపాయాల్లో ఏ మాత్రం కోత పడినా , ఈ సంపదలకు ఏ మాత్రం ప్రమాదం ఏర్పడినా పెట్టుబడిదారులకు ఎంతో కంగారు. అందువల్లే ఒక గర్భిణీని, ఇంటర్వ్యూ చేస్తోన్న ఒక ఉద్యోగిని, హాస్పిటల్లో ఉన్న మరో ప్రొఫెషనల్ ను, దశాబ్దాలుగా కంపెనీ ఎదుగుదలకు దోహదం చేసిన ఒక మేనేజర్నీ చిటికెలో రోడ్డు మీద పడేయగలరు. ఐటి రంగంలో ఐదారేళ్ళకు వచ్చే సంక్షోభమూ పెట్టుబడిదారీ సంక్షోభమే. కాబట్టి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ సంక్షోభాలు, నిరుద్యోగం , ఉద్యోగాల ఊచకోత ఉండి తీరుతాయి.